ఒక మనసు రివ్యూ : దిగులు ఎక్కువ! ప్రేమ తక్కువ!

admin
oka-manasu

విడుదల తేదీ:24 జూన్‌ 2016
న్యూస్‌మార్గ్‌.కామ్‌ రేటింగ్‌:2/5
పంచ్‌లైన్:ప్రేమ ‘వ్యధా’ చిత్రం

ఎవరెవరుప్లస్‌ పాయింట్స్‌మైనస్‌ పాయింట్స్‌ఫొటోలుట్రైలర్పబ్లిక్ టాక్

చిత్రం: ఒక మనసు

జోనర్‌: రొమాన్స్‌

దర్శకత్వం: రామరాజు గొట్టిముక్కల

నిర్మాత: మధుర శ్రీధర రెడ్డి

కథ: రామరాజు గొట్టిముక్కల

నటీనట వర్గం: నీహారిక కొణిదెల, నాగ శౌర్య, రావు రమేష్‌, ప్రగతి, వెన్నెల కిషోర్‌, ఆర్జే హేమంత్‌, శ్రీనివాస్‌ అవసరాల

పాటలు: రామ జోగయ్య శాస్త్రి, కృష్ణకాంత్‌, సిరివెన్నె సీతారామ శాస్త్రి

స్క్రీన్‌ ప్లే: రామరాజు గొట్టిముక్కల

సంగీతం: సునీల్‌ కాశ్యప్‌

  • చాలాకాలం తర్వాత, హుందాగా ఉండే తెలుగు అమ్మాయిని(నీహారికను) తెర మీద చూడగలగటం.
  • మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్‌ కాబట్టి, ఎలా చేస్తుందోనన్న ప్రేక్షకుల క్యూరియాసిటీ.
  • రావు రమేష్‌ రాజకీయ నాయకుడి అనుచరుడిగా, హీరో తండ్రిగా తన పాత్రలో భిన్నంగా కనిపిస్తారు.
  • సినిమా చూస్తున్నంత సేపూ హాయి గొలిపే సంగీతంలో తేలుతుంటాం.
  • ప్రేమకూ, పాలిటిక్సుకూ మధ్య వుండే వైరుధ్ధ్యాన్ని చూపించే కథ.
  • ముందుగా పాలిటిక్స్‌నూ, ప్రేమనూ- రెంటినీ తలక్రిందులుగా చూపించటం. (నేరమే రాజకీయమనీ, ఆకర్షణే ప్రేమ అనీ చెప్పక చెప్పేస్తారు.)
  • హీరోయన్‌ హుందాగా వుంటుంది కానీ, శక్తిమంతంగా వుండదు. బేలగా కనిపిస్తుంటుంది. (సున్నితత్వం అంటే బేల తనం అనుకున్నట్టున్నారు.)
  • ఏ మాత్రం మెరుపుల్లేని సంభాషణలు. అసలు పాత్రలంటేనే సంభాషణలు. సంభాషణల మీద విరక్తి పుట్టేంత సంభాషణలు.

 

కథాంశం: ఏముందీ? పువ్వులో వాసన.

Oka-Manasu-Telugu-Movieకొత్తగా కనిపెట్టిందీ కాదు, అలాగని కొట్టుకొచ్చిందీ కాదు. ఎప్పుడూ అనుకునేదే. ఇంధ్రధనువూ, వాన చినుకూ, మల్లెపువ్వూ.. బాగుండనిదెవరికీ… చూస్తూనో, తడుస్తూనో, వాసన చూస్తునో వుండి పోతాం. కొద్ది సేపే. ఏదయినా కొద్ది సేపే. మససులో పుట్టే కోరిక అలాంటిదే. తీర్చేసుకుంటే చాలు. పువ్వులాంటిదే మనసు కూడా, ఎంతో గంభీరంగా వుంటుంది. వెనీలా ఐస్‌ క్రీం లాంటిది కూడా. అనుభవం కొద్ది సేపే. చాలదూ. అయితే దాని జ్ఞాపకం శాశ్వతం. అఫ్‌ కోర్స్‌ ఎవరితో తిన్నాం- అన్నదాని మీద వుంటుంది. ఇష్టమయిన అమ్మాయితో తిన్నామా…? లేక బేవార్సు బాబాయితో తిన్నామా..? తేడా వుంటుంది. దీనినే కథా బీజంగా వాడుకున్నారు.

కథ: ‘సెటిల్‌మెంట్‌’ లవ్‌

Oka Manasuసంధ్య(నీహారిక)కు, శౌర్య (నాగ శౌర్య)ను చూడగానే ప్రేమ పుట్టేస్తుంది. అలాగని లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌- అని అనుకునేరు. లవ్‌ ఎట్‌ ‘సెకండ్‌ జన్మ’.. కాకుంటే ‘థర్డ్‌ జన్మ’ ..! ఆమె లవ్‌ డీప్‌ అని చెప్పడానికి ఇలాంటి దేదో కావాలి. మొదటి సారి చూసినా, ఎప్పుడో ఎక్కడో చూసినట్లు అనిపిస్తే.. అది మన ఖర్మ. జన్మల సిధ్ధాంతాన్ని నమ్మాల్సిందే. అది నమ్మకుంటే ‘మనసు’ ను నమ్మాల్సిందే. అలా అనిపిస్తుంది. చోద్యం కాకపోతే, ‘మనది జన్మజన్మల (మొగలిరేకుల సీరియల్‌) బంధం- అని ఎన్ని సినిమాల్లో జంటలు అనుకోలేదు. ఆ గొడవెందుకు కానీ, శౌర్యకు కూడా ఆమంటే పిచ్చి పుట్టేస్తుంది. కానీ శౌర్యకు వున్న నాన్న వున్నాడే ఆయన (రావు రమేష్‌) రాజకీయాల్లో వుంటాడు. ఆయన కార్యకర్తకు ఎక్కువ; నాయకుడికి తక్కువ. అందుచేత కొడుకును నాయకుణ్ని చేసేయాలనుకుంటాడు. కొడుకు తండ్రి కోరిక తీర్చటం కోసం, ఆకు రౌడీలా మారి, కనబడిన వాడినెల్లా తన్ని మొండి బాకీలు వసూలు చేయటం, కబ్జా చేసిన భూముల్ని ఖాళీ చేయించటం, తద్వారా కమీషన్‌ కొట్టుకోవటం లాంటి ఉదాత్త మైన వృత్తిని(సెటిల్‌ మెంట్లు) చేస్తుంటాడు. ఇది తప్ప రాజకీయాల్లోకి మార్గంలేదని శౌర్య నమ్మటమే కాకుండా, నీహారికనూ, సినిమా చూడటానికి వెళ్ళినందుకు మిమ్మల్నీ, నన్నూ నమ్మించటానికి ప్రయత్నిస్తాడు. ఆమెకు అతడి దారి నచ్చదు. అతడు నచ్చుతాడు. కడకు వెనకా ముందూ చూసుకోకుండా, ఎక్కువ కమీషన్‌ కోసం, ఓ దళితుణ్ణి కొట్టేస్తాడు. ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుకింద జైలుకు వెళ్ళి, ఏళ్ళ తర్వాత అతి కష్టం మీద బెయిలు వస్తాడు. అప్పుడు మళ్ళీ నీహారిక ను కలుస్తాడు. ఇంకోసారి బెయిల్‌ రాదు. ఈ లోగా అప్పటికే పెళ్ళయి విడాకులు పుచ్చుకున్న మామ( పలుకుబడిగల పాలిటిష్యన్‌) కూతుర్ని చేసుకుంటే, కేసు సంగతి ఆయన చూసుకుంటాడనే దగ్గర కథను అతి కష్టం మీద క్లయిమాక్సుకు తెస్తారు. అప్పుడు నీహారిక అందరు హీరోయిన్లు చేసే త్యాగమే చెయ్యాలి కదా!

ట్రీట్‌మెంట్‌: వినాల్సిన సినిమా (చూడాల్సింది కాదు)

oka-manasu-movieసంభాషణల మీదే సినిమా నడిపించేయాలనుకుని దర్శకుడు చాలా గట్టిగా నిర్ణయించేసుకున్నట్టున్నాడు. అవి కూడా. కానీ చిన్న లాజిక్కు మిస్సయ్యారు. సన్నివేశాలను బట్టి సంభాషణలు వుండాలి . కానీ సంభాషణల కోసమే సన్నివేశాలు రాసినట్లుంది. అవి కూడా నీహారిక, నాగ శౌర్యల మధ్యే ఎక్కువ నడుస్తాయి. ఎక్కడా ఏదో పొందుతున్నట్లు అనిపించదు. ఎప్పుడూ ఏదో కోల్పోతున్నట్లే అనిపిస్తుంది. దైన్యం వెంటనే ఒక ఆశ, మబ్బు తర్వాత సూర్యోదయం వస్తున్నట్లు అనిపిస్తుంటే, ఆసక్తిగా వుంటుంది. కానీ, ఎందునో నిరంతర దైన్యమే సినిమా అంతటా వుంటుంది.

స్క్రీన్‌ ప్లే: ‘ఫైట్‌'(హేట్‌) అండ్‌ లవ్‌ స్టోరీ

oka-manasu-stills14సరిగ్గా ఇలియానా చూసేటప్పటికే మహేష్‌ బాబు ఎవర్నోకొడుతున్నట్టుగా (ఇది వేరే సినిమాలో లెండి.) ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఆమె అతనిలో నచ్చని కోణం కనిపించటం (కొడుతూ వుండటం) ఆమె దూరంగా వుండాలనుకోవటం- ఈ దోబూచులాటతోనే సగం సినిమా వుండేలాగా ‘సీన్లు’ రాసుకున్నారు. మిగిలిన సినిమా అంతా ఇటు తండ్రి ప్రేమ, అటు ప్రేయసి ప్రేమ- రెంటికీ మధ్య హీరో గింజుకు లాడటమే. తన కొడుకు తనకు దక్కాలంటే, ఆమె దూరంగా జరగాలని మాత్రం ‘సంభాషణల్లో’ పెట్టకుండా నేపథ్య సంగీతాన్నీ, గీతాన్నీ ఆశ్రయించటం మాత్రం కొంతలో కొంత రిలీఫ్‌.

హీరో: చట్రంలో నటన

Actor Naga Shouryaనాగ శౌర్య ఇప్పటికే నటించిన చిత్రాల్లో ఒక ఈజ్‌ చూపిస్తాడు. ఓ పక్కింటి కుర్రాడిలా కనిపించే లవర్‌ బోయ్‌ పాత్రలో అతను నటించాల్సిన పని వుండదు. అతను కనిపించటమే అలా కనిపిస్తాడు. ఇక అతనిలో పలికే వేరియేషన్స్‌ కు ఈ సినిమాలో చాలా తక్కువ అవకాశం వుంటుంది. సినిమాలో శౌర్య బాగా చేయలేదు అనదగ్గ సన్నివేశాలేమీ లేవు. కోరుకున్న అమ్మాయికి.. ప్రతికూలంగా మారిన పరిస్థితులకు మధ్య నలిగిపోయే పాత్రలో శౌర్య చాలా బాగా నటించాడు. ఎక్కువ భాగం హీరోయిన్‌ పక్కనే వుంటాడు కానీ, ప్రతీ సారీ దాదాపు ఒకేలా ప్రవర్తించాల్సి వుంటుంది. కాకపోతే ఒక్కటే తేడా. జైలుకు వెళ్ళక ముందు సిగరెట్టు లేకుండా, జైలుకు వెళ్ళి వచ్చాక సిగరెట్టు కాలుస్తూ. అవే మాటలు మాట్లాడాల్సి వుంటుంది. ‘నవ్వు లేక పోతే, ఏదో లాగుతున్నట్లుంటుంది అమ్మాయి’. (ఇదే మాట హీరోయిన్‌ కూడా అంటుంటుంది.) ఇలాంటి డైలాగ్స్‌ పదే పదే చెప్పాల్సి వుంటుంది.

హీరోయిన్‌: జాగ్రత్తల మధ్య బందీ

Oka-Manasu-Movie-Photos-7తెలీయ కుండా ఒక పెద్ద బాధ్యత దర్శకుడి మీద పడింది. అది హీరోయిన్‌ విషయంలోనే. హీరోల కుటుంబాలనుంచి తెరమీదకు వారసులుగా కొడుకులే వస్తారు కానీ, కూతుళ్ళు రారు. వచ్చినా తమ అభిమానులు నొచ్చుకుంటారన్న ఒక భయం ఆ కుటుంబాలను వెంటాడుతుంటుంది. అయితే బాలీవుడ్‌ లోనూ, కడకు తమిళ చిత్ర పరిశ్రమలోనూ దీనిని బ్రేక్‌ చేసేశారు. కమల హాసన్‌ కూతురు శ్రుతి హాసన్‌ తెలుగులో కూడా దున్ని పారేస్తోంది. మన సినిమాల్లో హీరో కృష్ణ తనయ మంజుల కానీ, మోహన్‌ బాబు కుమార్తె లక్ష్మీ మంచు కానీ, కాస్త ఆలస్యంగా రొటీన్‌ హీరోయన్‌ పాత్రల్లో కూడా కాస్త భిన్నంగా రావాల్సి వచ్చింది. కానీ ‘మెగా’ ఫ్యామిలీ నుంచి నేరుగా హీరోయిన్‌ ని ప్రవేశపెట్టేటప్పుడు ‘మెగా హీరోల’ అభిమానుల మనోగతాన్ని దృష్టిలో వుంచుకుని నీహారిక కొణిదెలను ప్రవేశపెట్టే పనిని దర్శకుడు చేపట్టాల్సి వుంది. అయితే ఇందులో జాగ్రత్తలు మాత్రమే తీసుకున్నారు కానీ, ఆమెను ‘ఎలివేట్‌’ చేసే కథను ఎంపిక చెయ్యటం, పాత్రను అలా మలచటం వంటి విషయాల్లో దర్శకుడు ప్రతిభను చూపలేకపోయారు. జాగ్రత్తలు: పాటలు వున్నాయి, కానీ డ్యూయెట్లు లేవు. ‘హగ్స్‌’ వుంటాయి కానీ పరిమితులు వుంటాయి. ముద్దులు వున్నాయి.

ఇతర నటీనటులు: రావు రమేష్‌, వెన్నెలకిషోర్‌ ల సహజ నటన

Rao-Rameshరావు రమేష్‌ ఎప్పటిలాగే హీరో తండ్రి పాత్రలో ఒదిగి పోయాడు. ఏ డైలాగ్‌కీ కళ్ళు చెమ్మగిల్లక పోయినా, రావు రమేష్‌ బెయిల్‌ తెచ్చి కొడుకును కాపాడలేని దుస్థితిలో ‘ఎక్కడికన్నా పారిపో రా’ అన్నడైలాగ్‌ చెప్పినప్పుడు ‘మూవ్‌’ చేస్తాడు. ( ఇదీ కూడా డైలాగ్‌ మహాత్మ్యం కాదు లెండి. ఆయన నటనే). ఆ తర్వాత హీరోయిన్‌ తల్లి పాత్రలో ప్రగతి బాగా చేసినట్లనిపిస్తుంది. అది నటనలో కన్నా, ఆమె గద్గద స్వరంతో డైలాగ్‌ చెప్పిన తీరుతో వచ్చింది. వెన్నెల కిషోర్‌ పెళ్ళికొడుకులా వచ్చి ‘అలవాటయిపోతుంది కదండీ’ అన్న ప్రతీ సారీ నవ్వించాడు.

సంగీతం: బోర్‌డమ్‌ కు ‘సౌండ్‌ థెరపీ’

Sunil-Kashyapహమ్యయ్య, బాక్‌ గ్రౌండ్‌ స్కోర్స్‌, మూడ్‌ కు తగ్గట్టు వెనక నుంచి వచ్చే పాటలూ- ఇవే, ప్రేక్షకుణ్ణి బలవంతంగా నయినా ధియేటర్లో కూర్చోబెట్టగలిగాయి. అంతే కాదు, ఏదో లోతయిన సినిమా చూస్తున్నామేమోనన్న భ్రమకు కూడా మధ్య మధ్యలో గురిచేశాయి.

-సర్‌

Tags : , , , , , , , , ,