10వేల శత్రుసైన్యంతో పోరాడిన 21మంది యోధులు!

Surendra
21

కేవలం 21 మంది భారతీయ సైనికులు 10వేల శత్రుసైన్యంతో వీరోచితంగా పోరాడిన ఓ సంఘటన చరిత్రలో నిలిచిపోయింది

‘మగధీర’ చిత్రంలో ఒక్క సేనాని 100మంది సైనికుల్ని అడ్డుకుంటే ప్రేక్షకులు నివ్వెరపోయారు. ఒక్కడే అంతమందితో ధైర్యంగా పోరాడటం చూసి గొప్పగా భావించారు. అలాంటిది కేవలం 21 మంది 10వేల శత్రుసైన్యంతో వీరోచితంగా పోరాడిన సంఘటన చరిత్రలో నిలిచిపోయింది. ఆ 21 మంది ఎవరో కాదు.. మన భారతీయ సైనికులే. ఈ సంఘటన గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళితే..

బ్రిటీష్‌ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి. ఈశాన్య తిరాహ్‌ ప్రాంతం(ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో ‘సరగర్హి’ అనే చిన్న ప్రాంతమది. ఈ ప్రాంతం అఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ దేశాల సరిహద్దులో ఉన్న ‘లాకర్ట్‌-గులిస్థాన్‌ కోటల’ మధ్య సమాచార మార్పిడికి అందుబాటులో ఉండేది. అక్కడ 21 మంది సైనికులతో కూడిన 36వ సిక్కు రెజిమెంట్‌ పహారాగా ఉండేది. ఆ బృందానికి హవాల్దార్‌ ఇషార్‌ సింగ్‌ నాయకుడు. అప్పట్లో అఫ్ఘనిస్థాన్‌ సరిహద్దు దాటి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నం చేస్తూ ఉండేది. ఈ క్రమంలో 1897 సెప్టెంబర్‌ 12న 10వేల మంది సైన్యంతో అఫ్ఘనిస్థాన్‌ ‘సరగర్హి’ ప్రాంతంపైకి దండెత్తింది. దీంతో ‘సర్దార్‌ గుర్ముఖ్‌ సింగ్‌’ అనే సైనికుడు ‘లాకర్ట్‌ కోట’కు సమాచారం అందించాడు. శత్రుసైన్యం ‘సరగర్హి’ దగ్గరలోనే ఉండటంతో ఏమీ చేయలేనని, బలగాలు రావడానికి చాలా సమయం పడుతుందని తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. దాంతో 21మంది సైనికులే శత్రుసైన్యంతో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.

వెంటనే వారు ఏర్పాటు చేసుకున్న గడిలోంచే కాల్పులు జరపడం ప్రారంభించారు. మూడు గంటలపాటు శత్రువులను లోపలకి రానీయకుండా అడ్డుకోగలిగారు. ఈ పోరాటంలో 180 మంది చనిపోగా, చాలా మంది గాయపడ్డారు. ఆ తర్వాత బలగాలు వచ్చి వీరికి తోడుగా శత్రుసైన్యంతో పోరాడాయి. మొత్తం 600మంది ఈ యుద్ధంలో మృతి చెందగా, వేల మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే 21 మంది వీర జవాన్లు తమ చివరి క్షణం వరకూ పోరాడి అమరులయ్యారు.

మ‌న సైనికుల వీరోచిత పోరాటానికి గుర్తుగా రెజిమెంట్‌లోని 21మందికీ ఆనాటి అత్యున్నత పురస్కారమైన ‘ఇండియన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ అవార్డును ప్రకటించారు. ఒక బృందంలో ఉన్న సైనికులందరికీ ఈ అవార్డులు దక్కడం ప్రపంచంలోనే అది తొలిసారి. ఇప్పటికీ బ్రిట‌న్ సైన్యం సెప్టెంబర్‌ 12న ‘సరగిర్హి డే’ పేరుతో ఆ వీరజవాన్లకు నివాళులర్పిస్తూ, వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. భారతీయులంతా ఎంతో గ‌ర్వంగా చెప్పుకునే ఈ వీరోచిత పోరాటాన్ని ఫ్రాన్స్ ప్ర‌భుత్వం అక్క‌డి పిల్ల‌ల‌కు పాఠ‌శాలల్లో నేర్పుతోంది.

ఈ సంఘటనను సినిమాగా మలిచేందుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ప్రయత్నిస్తున్నారు.

Tags : , , , , , , , , ,