ప‌వ‌న్‌ క్లాసు కు రంగం సిద్దం

mohanrao
sujana

ప్ర‌త్యేక హోదా ఉంటేనే ఏపీ అభివృద్ది చెందుతుంద‌ని ఇంత కాలం ప్ర‌చారం చేసి ఇప్పుడు ప్యాకేజీ బెట‌ర్ అని చెప్ప‌టమే కాకుండా ప్యాకేజీ వ‌ల్ల క‌లిగే మేలు గురించి క్లాసు పీక‌డానికి సిద్ద‌ప‌డుతున్నారు.

ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇష్టం లేక‌పోయిన విభ‌జ‌నను ప్ర‌జ‌ల నెత్తిపై వేసిన పాల‌కులు న‌ష్టాన్ని పూరించ‌డానికి ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చారు. ఎన్నిక‌ల ముందు అన్ని పార్టీలు కూడా ఇదే పాట పాడాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని బీజేపీ పార్ల‌మెంట్‌లో చెప్ప‌ట‌మే కాకుండా ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో పొందుప‌ర్చింది. దాంతో ప్ర‌జ‌లు ఏపీకి ప్ర‌త్యేక హోదాపై న‌మ్మ‌కం పెట్టుకున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు 15 ఏళ్లు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. రెండున్న‌ర ఏళ్ల‌గా ఏపీకి ప్ర‌త్యేక హోదాపై కేంద్రం ప్ర‌భుత్వం నాన్చుతూ వ‌చ్చింది.

ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది. అయితే విచిత్రంగా ప్ర‌త్యేక హోదా కోసం మొద‌ట్లో ప‌ట్టుబ‌ట్టిన చంద్ర‌బాబు కేంద్రంతో వైరం పెట్టుకోవ‌డానికి ఎందుక‌నో, ఏమో ప్యాకేజీకి మ‌ద్ద‌తు ప‌లికారు. దాంతో ఏపీలో రాజ‌కీయాలు అసాంతం మారిపోయాయి.

ఇప్పుడు ఏపీలో ప్ర‌త్యేద హోదా కోరుకుంటున్న వారంద‌రూ ఒక దిక్కు. పాకేజీని బ‌ల‌ప‌ర్చుతున్న వారు ఒక ప‌క్క‌న నిలిచి ప్యాకేజీ బెట‌రా? హోదా బెట‌రా అనే చ‌ర్చ‌కు తెరలేపారు. టీడీపీ, బీజేపీతో పాటు చంద్ర‌బాబుకు అనుకూల మీడియా కూడా ప్యాకేజీ బెట‌ర్ అనే ప్ర‌చారానికి పూనుకున్నాయి. ప్ర‌త్యేక హొదా కోరుకుంటున్న వామ‌ప‌క్షాలు, వైసీపీ, ప్ర‌జాస్వామిక వాదులు. ప్ర‌జా సంఘాల నేత‌లు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి వారు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెల్సిందే. అయితే ప్ర‌త్యేక హోదా డిమాండ్‌పై ప‌వ‌న్ నిల‌బ‌డ‌టంతో ఇప్పుడు టీడీపీ, బీజేపీలు ఆయ‌న్ని మ‌ళ్లీ తమ దారికి తెచ్చుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నాయి. దానిలో భాగంగా ప‌వ‌న్‌కు ప్యాకేజీపై క్లార‌టీ ఇవ్వ‌డానికి సిద్దప‌డుతున్నారు. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి మీడియాలో బ‌హిరంగంగానే ప్ర‌క‌టించారు. అంతే కాకుండా బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబును ఎలా దారికి తెచ్చుకున్నామో తెలుసు క‌దా! ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కూడా అలాగే దారికి తెచ్చుకుంటామ‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. ఈ ప‌రిణామాలు ప‌రిశీలిస్తుంటే టీడీపీ, బీజేపీలు ప‌వ‌న్‌కు పెద్ద క్లాస్ ఇవ్వ‌డానికి సిద్ద‌ప‌డుతున్నార‌ని విశ్లేషిస్తున్నారు.

Tags : , , , , , , ,