సీన్ రివ‌ర్స్ టీఆర్ఎస్ నుంచి టీడీపీకి..

mohanrao
tdp

తెలంగాణ‌లో సీన్ రివ‌ర్స్ అయింది. అధికార టీఆర్ ఎస్‌లో చేరిన నేత‌లు మ‌ళ్లీ టీడీపీలో చేర‌డానికి సిద్ద‌ప‌డ‌టంతో టీడీపీ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత కొన్ని దుర దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. రాష్ట్రం విడిపోయాక కొత్త రాష్ట్రం తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగా, ఏపీలో టీడీపీ అధికారం చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణలో విపక్షాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో 15 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్న టీడీపీ… ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న పార్టీగా మిగిలిపోయింది. మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి గెలిచిన ఆ పార్టీ నేత మల్లారెడ్డి కూడా ఇటీవలే కారెక్కేశారు. మల్లారెడ్డికి కుడిభుజంలా వ్యవహరించిన ఆయన బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి కూడా తన బావ వెంటే గులాబీ గూటికి చేరారు. అయితే మద్దుల టీఆర్ఎస్ లో ఇమడలేకపోయారు. తన బావ టీఆర్ఎస్ నేతలతో బాగానే కలిసిపోయినా… మద్దుల మాత్రం టీఆర్ఎస్ కార్యక్రమాలతో అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు.

తాజాగా టీఆర్ఎస్ లో ఇక ఇమడలేనని తేల్చుకున్న మద్దుల… మళ్లీ తన సొంత గూడు టీడీపీ వైపు చూశారు. టీ టీడీపీ పెద్దలతో మంతనాలు సాగించారు. ఈ క్రమంలో మద్దుల రీఎంట్రీకి టీ టీడీపీ చీఫ్ ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన తన సొంత గూడుకు చేరుతున్నారు. మరికాసేపట్లో మేడ్చల్ నుంచి భారీ అనుచర గణంతో బయలుదేరనున్న మద్దుల… పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రమణ, రేవంత్ రెడ్డిల సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. మద్దుల వెంట ఆయన సొంతూరుకు చెందిన వారే కాకుండా… శామీర్ పేట, కీసర, ఘట్ కేసర్ లకు చెందిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నుంచి టీడీపీలోకి చేరుతున్నారు. ఈ పరిణామం టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సవం నింపనుంది. తెలంగాణలో టీడీపీకి కొంత శక్తి నిస్తుంది. ఇది టీఆర్ఎస్ కు కచ్చితంగా కడుపుమండే సన్నివేశమే. అయితే తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని చంకలు గుద్దుకునే వారికి ఇది నిజమైన షాకింగ్ న్యూసే అని చెప్పక తప్పదు.

Tags : , , , , , , , , ,